మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం)కి మూడు నెలల్లో కొత్త రూపు తీసుకువస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్లూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తక్షణ కార్యాచరణ కింద రూ.5.31 కోట్లతో ఎంజీఎంలో అత్యవసర పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాల సేవలను పునరుద్ధరించడంతో పాటు ఎంజీఎం ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చేస్తామని’ మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతు పనులును వెంటనే ప్రారంభిçస్తున్నట్లు చెప్పారు. పేదల ఆస్పత్రి ఎంజీఎంను కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపు తెచ్చారని అన్నారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ వైద్యం రూపురేఖలు మారాయని చెప్పారు. ఎంజీఎం కు సంబంధించి 2014లో 5 లక్షలు ఉన్న ఔట్ పేషెంట్ల సంఖ్య 2018లో 11 లక్షలకు పెరిగిందని సీఎం కేసీఆర్ కృషి వల్లే ప్రభుత్వ వైద్యం పై ప్రజలకు నమ్మకం పెరిగింది అనడానికి ఇది నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ఎక్కువగా ప్రసవాలు అవుతున్నాయని దీని వల్ల తల్లీబిడ్డ సురక్షితంగా ఉంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఎంజీఎంను పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలను అందించేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
పోస్టుమార్టం సేవలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఎంజీఎం అభివృద్ధిపై వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎంజీఎం సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు నెలల్లో ఎంజీఎంను రోగులకు మెరుగైన సేవలు అందించేలా మార్చాలని అధికారులను ఆదేశించారు.