గత పాలకుల వివక్షకు గురైన ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానకు ఉత్తమ సేవా పురస్కారం దక్కింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉన్నతాశయంతో వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో వేయి పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలోని నవ జాతా శిశు కేంద్రం (ఎస్‌న్‌సీయూ-స్పెషల్‌ న్యూ బార్న్‌ చైల్డ్‌ కేర్‌ యూనిట్‌) సిబ్బంది సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేసినట్లు వైద్యాధికారులు, ఆ విభాగం వైద్య నిపుణులు శనివారం తెలిపారు. రాష్ట్రంలో శిశు మరణాలు సంభవించకుండా పుట్టిన ప్రతీ బిడ్డ ఆరోగ్యంతో తల్లి ఒడిలో పెరగాలని అప్పుడే శిశు మరణాలు తగ్గించిన వాళ్లమవుతామని భావించిన సీఎం కేసీఆర్‌ సంకల్పంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 26 నవజాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే వాటిలోకెళ్ల ఎంజీఎం దవాఖానలోని పిల్లల వైద్య విభాగంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన ఎస్‌ఎన్‌సీయూ ప్రత్యేక వార్డులో వైద్యులతోపాటు నర్సులు, సిబ్బంది రేయింబవళ్లు పిల్లలకు సేవలందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయడాన్ని ప్రభుత్వం గుర్తించిందే తడవు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ తన ప్రత్యేక కార్యాలయంలో ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎంజీఎం సిబ్బందికి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. మొదటి సారిగా ఎంజీఎం దవాఖానలోని పిల్లల విభాగానికి ఈ అవార్డు రావడాన్ని హర్షిస్తూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ శ్రీనివాసరావు ఎస్‌ఎన్‌సీయూ వైద్యులతోపాటు అక్కడి సిబ్బందిని ఈ సదర్భంగా అభినందించారు..