ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మహిళను దారుణంగా మోసం చేశాడో వ్యక్తి. ఇద్దరూ కలిసి ఉన్న వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమంలో పెడతానంటూ బెదిరించి రూ.50 లక్షలు కాజేసిన నిందితుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిజాంపేటలో మామిడి సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌ రెడ్డి నివాసముంటున్నారు. వీరి స్వస్థలం కర్ణాటకలోని బీదర్‌. కొద్ది రోజులు అమెరికాలో ఉండి ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోకాపేటలో నివాసముంటున్న ఓ మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. 2018 జులైలో ఫేస్‌బుక్‌లో సంజీవరెడ్డి పేరుతో బాధితురాలికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రాగా.. దానిని ఆమె అంగీకరించింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫేస్‌బుక్‌, ఫోన్‌ ద్వారా పరిచయం పెంచుకున్నారు.

Advertisement

2018 అక్టోబర్‌ 31న బాధితురాలు అమెరికా నుంచి హైదరాబాద్‌ రాగానే సంజీవరెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి రిసీవ్‌ చేసుకుని ఆమె చెల్లెలు ఇంటి వద్ద వదిలిపెట్టాడు. రెండ్రోజుల తర్వాత బాధితురాలిని భోజనానికి రావాలని కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌కు సంజీవరెడ్డి ఆహ్వానించాడు. హోటల్‌కు వచ్చిన ఆమెకు అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిలను పరిచయం చేశాడు. బాధితురాలు భోజనం చేసేందుకు నిరాకరించడంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితురాలు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బాధితురాలిని సంజీవరెడ్డి, అతని భార్య, మేనల్లుడు కలిసి నిజాంపేట తీసుకెళ్లారు.

అక్కడ బాధితురాలిపై సంజీవరెడ్డి అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆమెను బెదిరిస్తూ నెలకు కొంత చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద ఉన్న 30 తులాల బంగారం, కొన్ని చెక్కులు, 6 వేల డాలర్లు బలవంతంగా లాక్కున్నాడు. ఇలా ఆమె వద్ద నుంచి మొత్తం దాదాపు రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. చివరికి బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు సంజీవరెడ్డి, భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌ను బీదర్‌లో అరెస్టు చేసి బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.