కళ్ళు లేకపోయినా ఓ మహిళ పెద్దమనసు చాటుకుంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం చాలా మంది సోనూ సూద్ ఫౌండేషన్ కు సాయం చేస్తున్నారు.అయితే ఇటీవల సోనూ సూద్ ట్రస్ట్కు ఓ అంధురాలు తన ఐదు నెలల పింఛన్ రూ. 15వేలు ఇచ్చేసింది. విషయం తెలుసు కున్న సోనూ ఈ అంధురాలి సాయం చూసి ఫిదా అయిపోయారు. ‘నిజంగా ఈ దేశం లో అసలైన సంపన్నురాలు ఎవరైనా ఉన్నారంటే అది ఈ మహిళే’ అంటూ ఆయన కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి పుట్టుకతో అంధురాలు. ఆమె ఓ యూట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తున్నారు. నటుడు సోనూ సూద్.. దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు సేవ చేసేందుకు ఓ ఫౌండేషన్ స్థాపించినట్టు తెలుసుకున్న నాగలక్ష్మి తనకు ప్రభుత్వం నుంచి వస్తున్న ఐదు నెలల పింఛన్ సొమ్మును సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఆమెను ప్రశంసించారు. ఈ దేశంలో నాగలక్ష్మి అసలైన సంపన్నురాలు అంటూ ఆమెను కొనియాడారు సోనూ..