అధికారుల నిర్లక్ష్యపు సమాధానం వల్ల ఓ పేద తండ్రి కూతురు శవాన్ని చేతిలతో మోసుకువెళ్లేలా చేసింది. డబ్బులు లేవని బతిమిలాడినా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంతో బోరున ఏడుస్తూ ఆటో స్టాండ్ వరకు తీసుకెళ్లాడు. ఏడేళ్లు కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు మరణం ఒక వైపు, అధికారుల నిర్లక్ష్యపు మాటలు మరోవైపు ఆ తండ్రిని కుంగదీశాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన సంపత్‍ కూతురు కోమలత(7) కొన్నాళ్లుగా ‘లివర్‍’ వ్యాధితో బాధపడుతోంది.

దీంతో ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. మంచి వైద్యం అందించేందుకు ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించేందుకు డబ్బులు లేక ఆరోగ్యం విషమించి ఆదివారం మరణించింది. చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో ప్రభుత్వ అంబులెన్సు ఇవ్వాలని కోరాడు. అయితే పని చేయడం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. చేసేది ఏమీలేక స్టెచర్‌పై హాస్పిటల్ ఎంట్రెన్స్ వద్దకు శవాన్ని తీసుకువచ్చాడు. అక్కడి నుంచి ఆటోల వరకు ఓ వైపు బోరున ఏడ్చుకుంటూ తీసుకెళ్లాడు.

బిడ్డ శవాన్ని చేతుల్లో పెట్టుకొని తమ ఊరికి తీసుకెళ్లాలంటూ ఆటో డ్రైవర్లను బతిమిలాడాడు. ఓ వ్యక్తి అంగీకరించి వారిని సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ ఘటన చూసిన వారంతా అధికారుల తీరును తప్పుబట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్‌లో అంబులెన్సులు లేకపోవడం ఏంటని మండిపడ్డారు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.