మంత్రి కేటీఆర్‌ స్వయంగా కారు నడిపి అందరినీ అశ్చర్యపరిచారు. సైయెంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టెక్‌ మహేంద్రా సీఈవో సీపీ గుర్నానీ, ప్రతినిధి అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హెలిక్యాప్టర్‌లో నిట్‌ ప్రాంగణంలో దిగిన మంత్రి కేటీఆర్‌కు వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

అక్కడి నుంచి మడికొండ ఐటీ పార్క్‌కు వెళ్లేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. అందరికీ అభివాదం చేసిన మంత్రి కేటీఆర్‌ ఐటీ ప్రతినిధులు కూర్చున్న బెంజ్‌కారు వద్దకు వెళ్లారు. ఆ కారు డ్రైవర్‌ను మరో వాహనంలో రావాలని చెప్పి. తానే స్వయంగా డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నారు. నిట్‌నుంచి మడికొండ వరకు స్వయంగా డ్రైవింగ్‌చేస్తూ వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇంటికి కారు నడుపుకుంటూనే వచ్చారు.

అక్కడ భోజనం చేశాక నిట్‌ ప్రాంగణంలోని హెలీప్యాడ్‌కు అదేకారులో బయలుదేరారు. ‘అరే రామన్నే కారు నడుపుతున్నడు ‘కేటీఆరే సెల్ఫ్‌ డ్రైవ్‌ చేస్తున్నరు’ అంటూ దారిపొడవునా ఒకటే చర్చ సాగింది. మంత్రి కేటీఆర్‌కు డ్రైవింగ్‌ అంటే అమిత ఇష్టమని పేర్కొంటూనే.. సీఎం కేసీఆర్‌కు సైతం డ్రైవింగ్‌ చేయడం చాలా ఇష్టమని.. ఉద్యమం సమయంలో ‘ఛలో ఢిల్లీ కార్‌ ర్యాలీ’ సందర్భంగా ఎక్కువ సమయం కారు నడిపింది కేసీఆరేనని గుర్తుచేసుకోవడం విశేషం.