అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో సరదాగా హోటల్‌కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్‌కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్‌(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్‌పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. అకౌంటెంట్‌గా జీఎస్‌టీలు ఫైల్‌ చేసేవాడు. డాన్‌బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్‌ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు.

పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతో పాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్‌లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ తీసుకెళ్లాడు. తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్‌ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్‌ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై బైక్, సెల్‌ఫోన్‌ విడిచి పెట్టాడు. లెటర్‌ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.