నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ షాక్‌తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్‌లోనే జడ్జి ఛాంబర్‌లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన విష్ణు(31) నెల రోజులుగా 23ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్‌ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్‌లో ఆరోపించాడాయన. దీంతో సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి జడ్జి ముందు మాట మార్చింది.

తనకు తన పేరెంట్స్‌ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్‌ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్‌ బెంచ్‌ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు ఓ కత్తితో జస్టిస్‌ అను శివరామన్‌ ఛాంబర్‌కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్‌లో ఇంకో కొసమెరుపు ఏంటంటే విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే సదరు యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది.