అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆరంభమే తనదైన నటనతో ఆకట్టుకున్న జాన్వీ, ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి చిన్నకుమార్తె జాన్వీ సోదరి ఖుషీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పెళ్లిసందడి చిత్రంతో ఈ యంగ్ బ్యూటీ బరిలో దిగుతోందన్నది వేడెక్కిస్తోంది. అయితే ఇది నిజమా.? అంటే దానిపై సరైన క్లారిటీ లేదు. నిజానికి శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం పెళ్లిసందడిని అతడి వారసుడు రోషన్ తో రీమేక్ చేసేందుకు కె.రాఘవేంద్రరావు చాలాకాలంగా ప్లాన్ లో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని 1996లో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆహ్లాదకరమైన స్క్రీన్ ప్లే, కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ వర్కవుటై అంతటి విజయం సాధ్యమైంది.

వైజయంతి అధినేత అశ్వనీదత్ తో కలిసి అల్లు అరవింద్ ఆ సినిమాని నిర్మించారు. నాటి క్లాసిక్ లో రవళి- దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ప్రస్తుతం సీక్వెల్ ని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇపుడు తెరకెక్కించబోతున్నారు. దాదాపు 25 ఏళ్ల తరువాత ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి పెళ్లిసందD అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించనున్నాడు. ఇక హీరోయిన్ గా ఎవరు నటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళ నటి మాళవికా నాయర్ నటిస్తునందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం రోషన్ కు జోడీగా శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ నటించనుందని ప్రచారం మొదలైంది. ఖుషీ కపూర్ తెరంగేట్రం నిజమా కాదా.? అన్నదానికి అధికారిక సమాచారం అయితే లేదు. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే ఈ మూవీ టీమ్ స్పందించాల్సిందే.