అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు: యూసూఫ్‌గూడకు చెందిన షేక్‌ నిస్సార్‌ అహ్మద్‌ కూతురు షాజియా తర్నూమ్‌(25)కి, ఎమ్‌ఎస్‌ మక్తాకు చెందిన ఆసియా బేగం కుమారుడు మహ్మద్‌ ఉమర్‌ (30)కి 2017వ సంవత్సరంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే భర్త, అత్త జమీర్‌ సోదరులు చిన్నచిన్న విషయాలకు దూషించడం, వేధింపులకు గురిచేయడం చేస్తుండే వారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారన్నారు. ఈ నెల 19వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఉమర్‌ షేక్‌నిస్సార్‌కు ఫోన్‌చేసి మీ కూతురు ఇంట్లో ఉరి వేసుకుందని, వెంటనే కిందకు దింపి సోమాజిగూడ డక్కెన్‌ ఆస్పత్రికి తరలించామని కాని అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పాడు. దీంతో షేక్‌ నిస్సార్‌ తన కూతురు ఆత్మహత్యకు భర్త, అత్త, మరిది, బావల వేధింపులే కారణమంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.