విదేశాల్లో ఉద్యోగం చేసే భర్త దొరికితే చాలు అమ్మాయిలు ఎగిరి గంతేసి పెళ్లి చేసేసుకుంటారు. అందులో కొన్ని సంబంధాల్లో మోసపోతున్నవాళ్ల కేసులు బాగానే ఉంటున్నాయి. తాజాగా గుజరాత్ లో కట్నం కోసం వేధిస్తున్న ఎన్నారై భర్త నుంచి న్యాయం చేయాలని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు చెందిన మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. భారత్ లో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్‌ వెళ్లినప్పటి నుంచి ఆమెను హింసించడం ప్రారంభించాడు. దుబాయ్‌ వెళ్లాక అతడిలోని అపరిచితుడు బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా తన భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అంతటితో ఆగక భార్య చేత బలవంతంగా బీర్‌ తాగించేందుకు ప్రయత్నించేవాడు.

ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్‌ తాగించేవాడు. భార్య తన మాట వినటం లేదని ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని తేల్చి చెప్పాడు. తనకు, తన బిడ్డకు ఆరోగ్యం బాగో లేకపోయినా పట్టించుకోలేదని ఆస్పత్రికి తీసుకువెళ్లటం మందులిప్పించటం చేసేవాడు కాదని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో బాధితురాలిని ఇండియా తీసుకు వచ్చాడు. అప్పడు ఆమెను పుట్టింట్లో వదిలేసి దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయ్ వెళ్లినప్పటి నుంచి అతని ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు, బుధవారం అహమ్మదాబాద్ పోలీసు స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది.