వరంగల్: అధికార పార్టీలో లుకలుకలు బయట పడుతున్నాయి. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఇవాళ హైదరాబాద్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారు ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీనియర్ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి విభేదాలు రచ్చకెక్కాయి. ఇవాళ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ మాజీ మేయర్ సతీమణి అయిన బొంతు శ్రీదేవి స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మధ్య వార్ మొదలైంది. ముందుగా వరంగల్ జిల్లా సంగతి చూస్తే రాజయ్య కడియం శ్రీహరి సీనియర్ నేతలుగా ఉన్నారు. వారిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు కావడమే ప్రధాన సమస్య. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడే మొదలైన పంచాయితీ ఒకే గూటికి చేరిన తర్వాత కూడా కొనసాగుతోంది. తాజాగా, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. రాజయ్య ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ పదవీకాలం ముగిసినందున కడియం శ్రీహరికి ప్రొటోకాల్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారట.

ఈ విషయం శ్రీహరి చెవిన పడడంతో ఆయన వెంటనే అంతెత్తున లేచారు. ప్రజా సేవ చేయడానికి ప్రొటోకాల్ తో పనిలేదని కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు, నా నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ కు రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని అన్నారు. త్వరలోనే నియోజకవర్గానికి వస్తానంటూ వ్యాఖ్యానించడంతో అగ్గి పుట్టింది. ఆ గొడవ అలా ఉండగానే ఇప్పుడు హైదరాబాద్ లో పంచాయితీ షురూ అయ్యింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కార్పొరేటర్ శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు. ఆయన తీరుకు నిరసనగా ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు పత్రికాప్రకటన కూడా విడుదల చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ మధ్య చర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. దీనికోసం మేయర్ విజయలక్ష్మిని ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎమ్మెల్యే ఆదేశాలతో ఇతర నేతలు ప్రారంభించారట. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఎమ్మెల్యే – కార్పొరేటర్ బాహాటంగానే వాగ్వాదానికి దిగారు.

తాజాగా, తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే తన డివిజన్లో పర్యటించారని శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా పేపర్ ప్రకటన ఇవ్వడంతో గొడవ పత్రికలకు ఎక్కింది. అయితే, వీరి మధ్య పంచాయితీ కూడా పాతదే. వాస్తవానికి ఉప్పల్ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ను మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆశించారు. కానీ అధిష్టానం చెప్పడంతో తప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచే వీరిద్దరికీ పడట్లేదని టాక్. ఇక GHMC ఎన్నికల్లో రామ్మోహన్ తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆమెను ఓడించడానికి ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపనలు ఉన్నాయి. ఇలా మొదలైన వీరి పంచాయితీ రానురానూ ముదురుతోంది. మరి గులబీదళంలో బయటపడుతున్న ఈ లుకలుకలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళ్తాయో చూడాలి.