మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అధికార పార్టీ నాయకుడిని తండా గిరిజనులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న నాయకుడికి గిరిజనులు దేహశుద్ధి చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల వివరాల మేరకు: వీర్నపల్లి మండలం శాంతినగర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత బానోతు విఠల్‌నాయక్‌ సీతారాంనాయక్‌తండాకు చెందిన ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహిళ ఇంటికి వెళ్లగా స్థానికులు గమనించి నిఘా ఉంచారు. రాత్రి పదకొండు సమయంలో మహిళ ఇంటి నుంచి విఠల్‌ బయటకురావడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. వివాహేతర బంధంపై నిలదీయగా సరైన సమాధానం రాకపోవడంతో గిరిజనులు విఠల్‌పై మూకుమ్మడిగా దాడికి దిగారు. తండావాసులంతా గుమిగూడడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విఠల్‌తోపాటు మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివాహేతర సంబంధంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.