కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది. దీనిపై ఇప్పటికే త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.
అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ట్రావెన్కోర్ రాజకుటుంబమే ఈ నిధులను కాపాడుకుంటూ వస్తోంది. అయితే, కొంతకాలం క్రితం వీటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో ట్రావెన్కోర్ కుటుంబసభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబానికే ఉండటాన్ని సమర్థించింది.