తెలంగాణలో తహశీల్దారా లావణ్య అవినీతి బాగోతం రెండు నెలల క్రితం సంచలనం సృష్టించింది. ఓ వీఆర్వో ని ఏసీబీ ట్రాప్ చేసిన టైమ్ లో అనుకోకుండా లావణ్య అవినీతి చిట్టా బైటపడింది. అప్పట్లో ఆమె ఇంట్లో రూ.93 లక్షల నగదు చూసి ఏసీబీ అధికారులే షాకయ్యారు. తాజాగా ఆమె భర్త మున్సిపల్ ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర నాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకటేశ్వరనాయక్‌ హన్మకొండకు చెందిన రణధీర్‌ నుంచి గతేడాది జులైలో రూ.2.50 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడు.

ఇదే సమయంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ప్రసూతి సెలవుపై వెళ్లడంతో ఆమెకు వచ్చే నెల జీతాన్ని వెంకటేశ్వర్‌ నాయక్‌ రణధీర్‌ ఖాతాలో వేయించాడు. ఈ ఏడాది జనవరిలో మహిళా ఉద్యోగి తిరిగిరావడంతో రణధీర్‌కు జీతం ఇవ్వలేకపోయాడు. ఏప్రిల్‌ తొలివారంలో రణధీర్‌ పురపాలక శాఖ ప్రాంతీయ అధికారిని కలిసి విషయాన్ని వివరించగా ఇది నకిలీ నియామకపు పత్రమని తేల్చేశారు. అయినా మరో రూ.40వేలు ఇస్తే ఈపీఎఫ్‌, ఈఎఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తానంటూ రణధీర్‌కు ఆశచూపించాడు. డబ్బులు లేవని, తనకు రావలసిన నాలుగునెలల జీతం ఇవ్వాలంటూ రణధీర్‌ వెంకటేశ్వర నాయక్‌ను ప్రశ్నిస్తే పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు. దీంతో రణధీర్‌ భయపడి హన్మకొండకు వెళ్లిపోయాడు.

వెంకటేశ్వర్‌ నాయక్‌ భార్య లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారన్న విషయం తెలుసుకున్న రణధీర్‌ ధైర్యం తెచ్చుకుని రెండు వారాల క్రితం ఏసీబీ డీఎస్పీని అచ్చేశ్వరరావును కలసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఇవ్వడంతో వారం క్రితం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆజాద్‌ బృందం వెంకటేశ్వర్‌ నాయక్‌ కదలికలపై నిఘా ఉంచి శుక్రవారం అతడితో పాటు దళారి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.