బుల్లితెర నటి దెబీనా బొనర్జీ డబుల్‌ సంతోషంలో మునిగిపోయింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మించిన ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. ఓవైపు చిన్నారి కూతురు లియానా ఆలనాపాలనా చూసుకుంటూనే, మరోవైపు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ మురిసిపోతోంది బ్యూటీ. అయితే అభిమానులు మాత్రం అప్పుడే రెండో బిడ్డ ఏంటని పెదవి విరుస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియాలో చిట్‌చాట్‌ చేసిన దెబీనాకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘ఈ మధ్యే కదా బిడ్డ పుట్టింది, అప్పుడే రెండో బిడ్డా? ఏదేమైనా కొంచెం గ్యాప్‌ ఇవ్వాల్సింది’ అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. దానికి నటి స్పందిస్తూ ‘నేనూ అదే అడుగుతున్నా మరి కవలలు పుట్టినప్పుడు వారినెలా చూసుకుంటారు?’ అని కౌంటర్‌ ఇచ్చింది. ఇక మరో వ్యక్తి ‘మొదటిసారి గర్భం దాల్చినప్పుడే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు రెండో ప్రెగ్నెన్సీకి కనీసం ఏడాదైనా ఆగకపోయారా?’ అని అడిగేశాడు. ‘అంటే మీరు నన్ను అబార్షన్‌ చేసుకోమంటున్నారా?’ అని ఆగ్రహించింది.

‘మీరు మరోసారి పాపనే కనాలనుకుంటున్నారా? నేనైతే మీకు మళ్లీ అమ్మాయే పుట్టాలని కోరుకుంటున్నాను’ అని ఓ అభిమాని కామెంట్‌ చేయగా ‘ఎవరైనా ఓకే కానీ, ఆరోగ్యకరమైన బేబీ పుడితే అంతే చాలు’ అని రాసుకొచ్చింది. కాగా ఎన్నోసార్లు ఆధునిక ఐవీఎఫ్‌ (ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్‌) విధానం ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించి అంతిమంగా సక్సెస్‌ అయింది దెబీనా. ఈ పద్ధతిలో పాపకు జన్మనిచ్చిన నటి ఆ తర్వాతి నాలుగు నెలల్లోనే మళ్లీ తల్లి కాబోతున్నానని ప్రకటించడం విశేషం.