తెలంగాణలో కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా రాజకీయం రోజురోజుకు పీక్స్ కు చేరుతోంది. ఇప్పటికే ఈ రెండు ప్రభుత్వాల మధ్య అనేక ఇష్యూస్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు తెలంగాణ ఆర్టీసీ నుండి వింత సమాధానం రావడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బస్సులు కావాలని టీఎస్ఆర్టీసీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ బస్సులు లేవని, ఆ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకుందని స్పష్టం చేసింది. దీంతో బస్సులు అందుబాటులో లేనట్లు తమకు అధికారికంగా లెటర్ రాసి ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరగా చూస్తామని ఆర్టీసీ అధికారులు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి లేకుండా ఇలా ముందస్తు బుకింగ్ గేమ్ కు తెరలేపిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రకటనల కోసం యాడ్ స్పేస్ లు అన్నింటిని టీఆర్ఎస్ ముందుగా బుకింగ్ చేసుకుని బీజేపీకి ప్రచారం జరగనివ్వకుండా నిలువరించగలిగిన సంగతి తెలిసిందే. తాజాగా విమోచన దినోత్సవం సందర్భంగా ఇదే స్ట్రాటజీ అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు అవుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా జాతీయ సమైక్యతా పేరుతో ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. అదే రోజు ఓ వైపు అమిత్ షా మరో వైపు కేసీఆర్ పోటాపోటీ కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడ్డాయి. దీంతో సెప్టెంబర్ 17పై రాజకీయం వాడీవేడీగా సాగుతోంది.