హైదరాబాద్ : అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సూసైడ్ చేసుకుందంటూ ఆమె తల్లిదండ్రులకు నిన్న మధ్యాహ్నం సమాచారం అందింది. భర్తతో విభేధాలు, అత్త వేధింపులతో కొంతకాలం హైదరాబాద్ లో తల్లిదండ్రుల వద్దనే ఉన్న వనిత గత జులైలో తల్లిదండ్రులు నచ్చ జెప్పడంతో భర్త వద్దకు వెళ్లింది.

అక్కడికి వెళ్లిన నుంచి భర్త వేధింపులతో తల్లిదండ్రులు, బంధువులతో కాంటాక్ట్ లో లేదు. ముఖంపై దిండుతో అదిమి చంపినట్లుగా ఆనవాలు కనిపిస్తున్నాయనీ అక్కడ నివసిస్తున్న ఆమె బంధువులు ఫోన్ లో తెలిపారు. ఘటన అనంతరం మృతురాలి భర్త రాచకొండ శివకుమార్ ను కరోలినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అత్తింటి వేధింపులే తమ కుమార్తెను బలి తీసుకున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగోల్ సాయినగర్ లోని వనిత పుట్టింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.