అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం:

అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మృతులను ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన దివ్య ఆవుల (34), రాజా (41), ప్రేమ్‌నాథ్‌ రామనాథం (42) గుర్తించారు. వీరిలో దివ్య, రాజా భార్యాభర్తలు. టెక్సాస్ స్టేట్‌లోని ఫ్రిస్కో సిటీలో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 06.40కి ఈ ప్రమాదం జరిగింది. FM 423పై డెల్‌వెబ్ బౌలేవార్డ్ జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో స్పాట్‌లోనే ఈ ముగ్గురు చనిపోయారు.

డలాస్ నుంచి ప్రిస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఫ్రిస్కో పోలీసులు గుర్తించారు. మృతులు ముగ్గురు కూడా ఫ్రిస్కో పట్టణంలోనే నివసిస్తున్నారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న టెక్సాస్ పోలీసులు భారతీయ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. వీరి మృతితో ముషీరాబాద్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమవారి మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలు వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇటు తెలంగాణ, అటు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.