అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 24 నుంచి 26 వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. హూస్టన్‌లో జరిగిన ‘హౌడీ-మోదీ’ సభ మాదిరిగానే అహ్మదాబాద్‌లో కూడా జరిగే ఓ భారీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

ఇరువురు దేశాధినేతల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యమే ప్రధాన అజెండాగా ఉంటుందనీ తెలుస్తోంది. ట్రంప్‌తో పాటు అమెరికా కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ కూడా వస్తున్నారని అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా గౌరవిస్తుందనీ… ఉన్నత స్థాయి సమావేశాల్లో ఎక్కడా కశ్మీర్ అంశం గురించి ప్రస్తావన ఉండబోదని కూడా అమెరికా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. అమెరికాలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం, రాబోయే అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. కాగా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ వచ్చివెళ్లిన సంగతి తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం విశేషం.

చర్చించే అంశాలివీ?

ట్రంప్ టూర్​లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్, ఆఫ్గనిస్తాన్​, ఇరాన్​, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశంఉందని చెబుతున్నారు..