కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ చాపకింద నీరులా దేశమంతా విస్తరిస్తోంది. తొలి రోజుల్లో అంతా సవ్యంగానే ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా. చివరకు ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా చివరకు తాను కూడా పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చని స్వయంగా ట్రంపే తెలిపారు. అయితే, తనకు ఇప్పటి వరకు వైరస్‌ లక్షణాలు మాత్రం లేవని స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆరోగ్యం బాగానే ఉందని శ్వేతసౌధం గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ఇప్పట్లో పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది. తాజాగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం రావొచ్చని ట్రంప్‌ అనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఇప్పటి వరకు 41 మంది మరణించగా.. 1,678 మందికి వైరస్ సోకింది.