నెల్లూరు జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణంపాలయ్యారు. తడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలు క్లవ్‌పేటకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఒంగోలుకు చెందిన పందిటి యశ్వంత్‌ (35) తల్లిదండ్రులు అమెరికా వెళుతున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి గురువారం చెన్నై వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిని చెన్నై విమానాశ్రయంలో దింపిన యశ్వంత్‌ కారు నడుపుకుంటూ తిరుగు పయనమయ్యారు.

కారు ఆంధ్రాలోకి ప్రవేశించిన అనంతరం తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న పాల లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ఉన్న యశ్వంత్‌ భార్యఅనుసెల్వి (27), కుమారుడు రియాంత్‌ షరి (ఏడాది బాబు), అక్క మాడుగుల విజయలక్ష్మి (37) అక్కడికక్కడే మృతి చెందారు. యశ్వంత్‌ తోపాటు అక్క కుమార్తెలు రితిక (12), నమిత (స్మైలీ) (14) తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మాడుగుల నమిత మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.

ఆటోను ఢీకొన్న ఇన్నోవా నలుగురు మృతి:

ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామ సమీపంలో నెల్లూరు–ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆత్మకూరు నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ఆటో వాశిలి గ్రామానికి చేరుకుంది. నెల్లూరు–ముంబై జాతీయ రహదారికి పక్కనే ఉన్న గ్రామంలో ప్రయాణికులు ఆటో దిగుతున్న క్రమంలో ఆత్మకూరు నుంచి అత్యంత వేగంగా నెల్లూరుకు వెళుతున్న ఇన్నోవా కారు వెనుకనే వస్తూ ఆటోను ఢీ కొంది.