ఓ అమ్మాయిని ఎరగా వేసి తన బంధువును చంపేశాడు మరో వ్యక్తి. అయితే ఈ విషయం వెలుగులోకి రావడానికి ఏడు నెలల సమయం పట్టింది. అంత పక్కాగా మర్డర్ ప్లాన్ చేసిన నిందితుడు, చివరకు పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో చట్టానికి చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జరిగింది. ముమ్మిడివరం మండలంలోని సీహెచ్ గున్నేపల్లికి చెందిన రామకృష్ణ గతేడాది డిసెంబర్ 8న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే రామకృష్ణ తాను పెళ్లి చేసుకున్నామని ఓ యువతి ఫోన్ చేసి చెప్పడంతో తరువాత వస్తాడులే అని అంతా అనుకున్నారు. అయితే ఆరు నెలలు గడిచినా, రామకృష్ణ ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లి వెంకాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. అమలాపురం డీఎస్పీ, క్రైం పార్టీ, మమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణకు బంధువైన శ్రీనివాస ప్రసాద్ అతడిని హత్య చేసినట్టు గుర్తించారు. ఓ భూ వివాదం కారణంగా రామకృష్ణను పథకం ప్రకారం అమ్మాయి ద్వారా ట్రాప్ చేయించి హత్య చేయించినట్టు తేల్చారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలేనికి చెందిన ఒక మహిళను ఎరవేసి రామకృష్ణను అక్కడికి రప్పించి హత్య చేశారు. అనంతరం అతడిని కరప మండలం అరటకట్ల పంట కాల్వలో గతేడాది డిసెంబర్ 11న శవానికి బండరాయిని కట్టి పడవేశారు.