మధురై సమీపంలో ఓ యువతి తన స్నేహితురాలిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ దంపతులుగా మారి గురువారం రామనాథపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ వద్ద తమ సమస్యను విన్నవించుకున్నారు. మధురైకి చెందిన అమ్మాయిలు , నవ దంపతులు జాయ్‌సన్‌ జ్యోష్వా, సుకన్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. సుకన్యకు ముందే వివాహం అయింది. అయినప్పటికీ వీరిద్దరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ..‘‘నేను, బ్యూలా పాఠశాలలో చదువుతున్నప్పుడే బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కాలక్రమంలో ఇద్దరు కలసి జీవించాలని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాం. మా ఇంట్లోవారు తీవ్రంగా వ్యతిరేకించి ఇద్దరినీ విడదీశారు. 2012లో నన్ను రామనాథపురానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అనంతరం నాకు ఓ ఆడ బిడ్డ పుట్టింది.
ఈ స్థితిలో నా భర్త ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నన్ను బాధించింది. దీంతో విరక్తి చెందిన నేను నా పాత స్నేహితురాలైన బ్యూలాని కలుసుకుని నా పరిస్థితిని వివరించాను. తరువాత ఇద్దరు మళ్లీ కలసి జీవించాలని సిద్ధమయ్యాం. ఇందుకోసం మూడు నెలలకు ముందు బ్యూలా పుదువైకి వెళ్లి ఆపరేషన్‌ చేయించుకుంది. తరువాత ఆమె పురుషుడిలా మారి జాయ్‌సన్‌ జ్యోష్వా అని పేరు మార్చుకున్నాడు. తరువాత మధురైలో ఉన్న ప్రైవేట్‌ షాపింగ్‌ మాల్‌లో నేను, జాయ్‌సన్‌ సెక్యూరిటీగా పని చేస్తున్నాం.
మేము భార్యభర్తలుగా సంతోషంగా కాపురం చేస్తున్నాం. అయితే నా బిడ్డని నేనే పెంచుకుంటా. నా మొదటి భర్త దగ్గర నుంచి నా బిడ్డను ఇప్పించాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మమ్మల్ని కొందరు విడదీయాలని చూసినా కాలం మమ్మల్ని కలిపింది. నా ఆరేళ్ల కుమార్తె నాకు కావాలి. ఆమెని మేము బాగా పెంచుతాం’ అని సుకన్య తెలిపింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కోర్టుకు వెళ్లి చట్టం ప్రకారం బిడ్డను పొందాలని పోలీసులు సూచించారు.