పెద్దవంగర: లాలించి జోల పాడి నిద్రపుచ్చే తల్లిని శాశ్వత నిద్ర ఆవహించిందని తెలియక అమ్మా లే అమ్మా పాలు ఇవ్వమ్మా, అంటూ తల్లి మృతదేహంపై పాల కోసం ఓ పసికందు ఆరాట పడిన విషాద ఘటన ఇది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం: పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామానికి చెందిన తేలుకుంట్ల స్వరూప (24), నరేష్‌లకు ఇద్దరు పిల్లలు మూడేళ్ల ఆకాంక్ష, పదినెలల ఆధ్య. నరేష్‌ ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేశాడు.

శుక్రవారం రిజిస్టేషన్‌ చేయించుకుని స్వగ్రామం కొరిపల్లికి ద్విచక్రవాహనంపై కుటుంబంతో సహా తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి తిర్మలగిరి మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో స్వరూప అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారులకు గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది నెలల ఆద్య తల్లి స్వరూప మరణించిన విషయం తెలియక పాలకోసం అల్లాడిపోయింది. చనిపోయిన తల్లి రొమ్ము మీద పడి పాల కోసం ఆరాటపడటం చూసిన వారు కంటతడి పెట్టారు.