ప్రేమించి పెళ్లి చేసుకుంది 11 ఏళ్ళు కాపురంచేసింది, ముగ్గురు పిల్లలు. బుద్ధిదారి తప్పి అక్రమసంబంధానికి పూనుకుంది. భర్త మందలించడంతో ప్రియుడు సాయంతో లారీతో ఢీకొట్టించి చంపేసింది.ఇందుకోసం రాత్రి 11 గంటలసమయంలో కావాలనే భర్తను జలుబుగా ఉందంటూ మాత్రలకు పంపి ప్రియుడికి చెప్పి చంపించింది, మదనపల్లెలో జరిగిందీ ఘోరం. హతుడు పేరు బాలసుబ్రహ్మణ్యం . అతనికి 11ఏళ్ల క్రితం రేణుకతో ప్రేమ వివాహమైంది.

వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌సెంటర్‌ నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో పాటు మదనపల్లెలోనే ఉన్న రేణుక ఓ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి కె.నాగిరెడ్డితో పరిచయం పెంచుకుంది. ఇటీవల బాలసుబ్రహ్మణ్యం తిరిగి మదనపల్లెకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు. తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించి ఆమెను మందలించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన భర్తను వదిలించుకోవాలని నాగిరెడ్డితో ఆమె చెప్పింది.

అతను తనకు తెలిసిన వారి లారీతో ఢీకొట్టించి చంపేందుకు పథకం వేశాడు. పదిరోజులుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో శనివారం రాత్రి జలుబు ఎక్కువగా ఉండటంతో రాత్రి 11గంటల సమయంలో పట్టణంలోకి వెళ్లి మాత్రలు తీసుకురమ్మని ఆమె బలవంతపెట్టింది. మందుల కోసం వెళ్లి వస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ప్రమాదంలో బాలసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మృతుడి సోదరుడు న్యాయవాది అయిన కె.రఘుపతి అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాల్మీకిపురం వద్ద లారీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పథకం ప్రకారమే బాలసుబ్రహ్మణ్యంను చంపేందుకు రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి, మరికొందరు పథకం వేసినట్లు బయటపడిందని సీఐ తెలిపారు. రేణుక, నాగిరెడ్డితో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.