అతడో అమాయక భర్త ! తన భార్యను ఎంతగానో నమ్మాడు! ఎంతగా అంటే మరికొన్ని గంటల్లో భార్య , తన ప్రియుడితోకలిసి తనను సజీవదహనం చేయబోతొంది. కానీ అమాయక భర్త రమేశ్‌ తన భార్యతో కలిసి టిక్‌టాక్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అల వైకుంఠపురములోని ‘రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో నా పాణం తీసిందిరో’ అనే పాటకు డ్యాన్స్‌ చేస్తూ రమేశ్‌ ఎంతో సంతోషంగా ఆ వీడియోలో కనిపించాడు. అంతలోనే తాను ఎంతగానో ప్రేమించిన భార్యే తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు.

వనస్థలిపురంలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో భార్య కుట్ర కోణం బయటపడింది. గత నెల 26న ఎస్కేడీ నగర్‌లో గుడిసె దగ్ధమై రమేష్‌ మృతి చెందాడు. ఈఘటనలో అతని భార్యే, ప్రియుడితో కలిసి ఈఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

పోలీసుల కథనం ప్రకారం: రమేశ్‌ తన భార్య స్వప్నతో కలిసి వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. అయితే, స్వప్న వెంకటయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ వివాహేతర బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి అతడ్ని హతమార్చేందుకు స్వప్న ప్రణాళిక రచించింది. గత నెల 26న రాత్రి రమేష్‌ నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు వెంకటయ్యతో కలిసి గుడిసెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఈఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న రమేశ్‌ సజీవ దహనమయ్యాడు. గుర్తు తెలియని ఓ వ్యక్తి గుడిసెలో సజీవదహనమయ్యాడని పోలీసులకు సమాచారమందగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూడటంతో స్వప్న, ఆమె ప్రియుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు.