అయోధ్య : సువిస్తార సరయూనది ఒడ్డునే పొంగిపొర్లుతుండగా బుధవారం అయోధ్య పట్టణంలో అప్పటి రామాయణ టీవీ సీరియల్ నాటి ఘట్టాలు తిరిగి ప్రత్యక్షం అయ్యాయి. పట్టపగలు కూడా వింతకాంతులతో మెరుస్తూ అంతా రామలయబద్ధంగా మారిన ఈ రామపురిలో ప్రజలు టీవీ సెట్లకు అతుక్కుపొయ్యారు. తమ ఊరిలోనే జరిగే రామాలయ ఆవిర్భావ ఘటానికి నాందీప్రస్తావనగా జరిగే భూమిపూజ విశేషవేడుకను ప్రస్తుత దశలో ఇంటి నుంచే తిలకించారు. ఓ వైపు శంఖాలతో పూరింపులు, పలు ఆలయాలలో గంటల మోత, చప్పట్లు కేరింతలతో అయోధ్య నవోధ్య అయింది. సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. వ్యాపారులు షాపుల్లోని టీవీ సెట్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతంగా అంతటా జైశ్రీరామ్, సియావర్ రామచంద్ర కీ జై నినాదాలు నింగికంటాయి. తమకు ఏటేటా వచ్చే దివాలి ముందుగానే వచ్చిందని స్థానికులు తెలిపారు. ప్రజలంతా పట్టణంతో సహా మతపరమైన ఆధ్యాత్మికయుతమైన ఉద్వేగంతో కట్టిపడేసినట్లు అయింది. తరాలుగా మెరుస్తూ వచ్చిన రామాలయ నిర్మాణపు కల ఇప్పటికి నెరవేరుతోందని వృద్ధులు సంతొషం వ్యక్తం చేశారు.

ప్రతి వీధి రామచిత్రాలతో , స్వాగత తోరణాలతో కళకళలాడింది. శ్రీఘార్ హాట్‌లోని కొన్ని జువెలరీ షాపుల యాజమానులు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసార వీక్షణ కేంద్రాలుగా మారాయి. అక్కడ బయట సామూహికంగా ప్రజలు తిలకించేందుకు భారీ బోర్డులతో కూడిన టీవీ సెట్లను అమర్చారు. దీనితో దారిలో పొయ్యేవారు అంతా కూడా భూమిపూజ ఘట్టాన్ని కళ్లార్పకుండా చూస్తూ ఉండిపొయ్యారు. పోలీసులు భద్రతా సిబ్బంది, కవరేజ్‌కు వచ్చినమీడియా వారు కూడా ఇటువైపే దృష్టిసారించారు.ఇప్పుడు తమకు 1980 నాటి రోజులు గుర్తుకువస్తున్నాయని, అప్పట్లో దూరదర్శన్‌లో రామాయణం టీవీ సీరియల్ వస్తూ ఉండేదని, అప్పట్లో అతి తక్కువ మందికి టీవీలు ఉండటం, అదీ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండటంతో సీరియల్‌ను చూసేందుకు తాము అంతా టీవీలు ఉన్న వారి ఇళ్లకు వెళ్లేవారిమని, లేదా కొన్ని షాపుల వారు బయట టీవీ సెట్లు పెట్టేవారని కొందరు పెద్దలు తెలిపారు.

ఇక ప్రధాని మోడీ అయోధ్యకు వచ్చిరాగానే ముందుగా స్థానికంగా ఉండే శక్తివంతమైన హనుమాన్ గడీకి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. ప్రధాని అక్కడికి రావడం , హారతి ఇవ్వడం, సాష్టాంగ ప్రణామం చేయడం వంటి పలు అంశాలను ఈ ఆలయం సమీపంలోని భవనాల పై నుంచి స్థానికులు తిలకించారు. ఇక్కడి నుంచే టీవీ కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు దృశ్యాలను చిత్రీకరించారు. రామాలయ నిర్మాణం తమ ఇంట్లో పండగ అని తెలియచేస్తూ దుకాణాదార్లు ప్రజలకు లడ్డూలు పంచిపెట్టారు.