భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్‌ చేసినందుకుగాను బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్‌ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్‌పేట మండల తహసీల్దార్‌ సుజాత గత ఏప్రిల్‌ 30న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఖాలీద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ రవీందర్‌ డిమాండ్‌ చేశాడు. ఖాలీద్‌ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్‌ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్‌ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్‌పేట మండల కార్యాలయం, ఆర్‌ఐ నివాసం, తహసీల్దార్‌ ఇంట్లో, ఎస్‌ఐ రవీందర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్‌ సుజాతను విచారించనున్నారు. ఎస్‌ఐ రవీందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు.