వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు కొందరు. ఆ కోవలోకే వస్తారు కేరళకు చెందిన ఉద్యమ నేత రెహానా ఫాతిమా. తన మాటలతో చేతలతో తరచూ వివాదాల్లో నిలిచే ఆమె, శబరిమల ఎపిసోడ్ తో మరింత ఫేమస్ అయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటకట్టుకోవటంతో పాటు, సామాన్య ప్రజలు సైతం ఆమెను ఇట్టే గుర్తించే పేరును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఆర్థనగ్నంగా కనిపిస్తున్న ఆమె వీడియో సంచలనంగా మారింది. తన కొడుకు, కుమార్తె చేత బాడీ పెయింటింగ్ వేయించుకున్న వైనంపై పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదేం పోయేం కాలమని మండి పడుతున్నారు. ఎలాంటి అచ్ఛాదన లేకుండా ఉన్న పై భాగంపై ఆమె ఇద్దరు పిల్లలు బాడీ పెయింటింగ్ వేస్తున్న తీరును వీడియో తీయించారు. వాటర్ పెయింట్స్ తో ఆమె కుమార్తె, కుమారుడు ఇద్దరు కలిసి చక్కటి పెయింటింగ్ వేశారు.

బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో యూట్యూబ్ లో ఆమె పోస్టు చేసిన వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. చిన్న పిల్లలతో ఇలాగేనా ఉండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తీరు ఏ మాత్రం సరికాదంటూ మండిపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా వ్యవహరించిన ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్న వారు లేకపోలేదు. అయితే, ఆమె మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటే ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రాన్ని వేసి కూల్ చేశారని ఆమె పేర్కొన్నారు. నిజంగానే కంటి సమస్యతో బాధ పడుతున్న వేళ, అర్థనగ్నంగా ఉన్న శరీరంపై బాడీ పెయింటింగ్ వేస్తుంటే కూల్ అవుతుందా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఏమైనా, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆమె.. తన తాజా వీడియోతో మరోసారి రచ్చను క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.