వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నాయి. పరాయి మహిళ/పురుషుడుపై మోజు వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తోంది. తాజాగా ఒక యువకుడు వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. వరసకు అత్త అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం అందరికి తెలిసేసరికి అవమాన భారంతో ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే: తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివ(27), శిరీష(25) దంపతులు. ఎటువంటి కలతలు లేని వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. శిరీష గత కొన్నేళ్ల నుంచి వారి ఇంటిపక్కనే వరుసకు అల్లుడయ్యే శ్రీకాంత్(24) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మందలించారు. దీంతో కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న వీరిద్దరూ ఇటీవల మళ్లీ కొనసాగించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే శిరీష భర్త అయిన శివ పనిమీద పొరుగూరు వెళ్తున్నానని, రాత్రి ఇంటికి రాకపోవచ్చని తెలిపాడు. ఇక ఇదే అదునుగా భావించిన శిరీష, శ్రీకాంత్ ని ఇంటికి పిలిపించుకొని రాసలీలల్లో మునిగితేలింది.

ఇక కోడలు, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం గమనించిన శిరీష అత్త వారున్న గదికి గొళ్ళెం పెట్టి చుట్టుపక్కల వాళ్ళని అప్రమత్తం చేసింది. ఇది గమనించిన శ్రీకాంత్, శిరీష బయటకు వస్తే పరువు పోతుందని ఊహించి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో శిరీషతో కలిసి శ్రీకాంత్ కూడా ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతిచెందారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగు వారు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. చేతికొచ్చిన కొడుకు ఇలా మరణించడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రం లో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.