తెలుగుచిత్రపరిశ్రమలో గందరగోళం సృష్టించి చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పాల్గొంటానని చెబుతొంది. ఆమె చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పుడు తమిళ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయనున్నా. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. నేను తప్పులు చేశా. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. . అవకాశాల కోసం పలు తప్పులు చేశా. ఇకపై అలా జరగవని’ పేర్కొన్నారు.

నటుడు ఉదయనిధిపై తాను ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్టులో నిజం లేదని, అది తాను పెట్టిన పోస్టు కాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అసలు ఉదయనిధిని తాను ఎప్పుడూ నేరుగా చూడలేదన్నారు. ఉదయనిధిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘కరుణానిధి కుటుంబంపై నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉదయనిధిని నేను నేరుగా చూసిన సందర్భం లేదు.

ఆయన గురించి వచ్చిన పోస్టు నా ఫేస్‌బుక్‌ ఖాతాది కాదు. అది ఓ నకిలీ ఖాతా. ఎవరో పనిగట్టుకుని అలా చేశారు. ఉదయనిధి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలని చేస్తున్న చర్యలివి. నా పేరిట సామాజిక మాధ్యమాల్లో పలు నకిలీ ఖాతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశా. చాలా మంది కథానాయికలు చిత్ర పరిశ్రమలో లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై బాహాటంగా ఆరోపణలు చేసినప్పటికీ నాకు మద్దతు దక్కలేదు అని అన్నారు…