కరోనాతో పోరులో రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో తనవంతు కృషి చేశాడు ఓ ప్రభుత్వ డాక్టర్‌. కానీ, అదే కరోనా సోకడం, దీనికి ఆసుపత్రుల నిర్లక్ష్యం తోడవ్వడంతో కరోనా వారియర్‌ కన్నుమూశాడు. కరోనాతో మూడు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేసినా వివిధ సాకులు చెబుతూ ఆసుపత్రుల్లో చేర్పించుకోలేదు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కరోనా సోకితే డాక్టర్‌కే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ మంజునాథ్ బెంగళూరు నగరంలోని రామ్ నగర్ జిల్లా కనకపురా తాలుకూలోని చిక్కలముడివాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది. చికిత్స చేపించుకోవడానికి వెళితే మూడు ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకొనేందుకు నిరాకరించాయి. శ్వాస తీసుకోవడంలో మంజునాథ్ ఇబ్బంది పడ్డారని, అనుమానిత కేసు కావడంతో పరీక్షల కోసం నమూనాలను పంపామని అతని బంధువు బీబీఎమ్‌పీ మెడికల్ ఆఫీసర్ డా.నాగేంద్ర కుమార్ వెల్లడించారు. తాము వైద్యులమని తెలిసినా ఆసుపత్రుల వారు చేర్చుకోలేదని, కరోనా నిర్ధారణ ఫలితాల నివేదిక రాలేదని వెనక్కి పంపారని వివరించారు. డా. మంజూనథ్‌ను చేర్పించుకోవడానికి జేపీ నగర్‌లోని రాజశేఖర్‌ ఆసుపత్రి, కెంగెరీలోని బీజీఎస్‌ గ్లోబల్‌ ఆసుపత్రి, కుమార స్వామి లే అవుట్‌లోని సాగర్‌ ఆసుపత్రిలు నిరాకరించాయన్నారు. సాగర్‌ ఆసుపత్రి ఎదుట బైఠాయించడంతో ఆ తర్వాత చేర్చుకున్నారని తెలిపారు. చివరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకుండా పోవడంతో గురువారం డా.మంజునాథ్‌ తుదిశ్వాస విడిచారు.