హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్‌ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరగా ట్యాంక్‌బండ్‌, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పే స్కేల్‌ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పే స్కేల్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరోవైపు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఫిషరీస్‌ విభాగం ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపల టెండర్లను ఏపీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రూ.2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటూ ఆ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.