ఏ నాట్యకారిణికైనా వందలమంది, వేలమంది ఎదుట ప్రదర్శన ఇవ్వాలనే ఉంటుంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాలనే కోరుకుంటుంది. కరోనా నేపథ్యంలో ఆ పరిస్థితి లేదు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో జరగాల్సిన ఆల్‌ ఇండియా డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ నృత్యోత్సవాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ నృత్య కళాకారులు పాల్గొంటారు. తెలంగాణ తరఫున కూచిపూడి నృత్యకారిణి హిమాన్షి ప్రాతినిధ్యం వహించనున్నది.

హిమాన్షి వరంగల్‌లో పుట్టి పెరిగింది. ప్రస్తుతం బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నది. తను రెండో తరగతిలో ఉండగానే నృత్య సాధన ప్రారంభించింది. ఇప్పటికి వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చింది. శ్రీలంక, మారిషస్‌, అండమాన్‌ నికోబార్‌లలో నృత్యాభిమానుల్ని అలరించింది. అలా ఓ కన్నడ దర్శకుని కంటపడింది. శాండల్‌వుడ్‌లో ఓ నృత్యప్రధానమైన చిత్రంలో మేకప్‌ లేకుండా నటించింది. అంతేకాదు.. చిత్రంలోని పాటలకి తానే కొరియోగ్రఫీ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ బయోపిక్స్‌.. కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో దగ్గుబాటి పురందేశ్వరి పాత్ర చేసింది. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆమె స్వయంగా వచ్చి చూశారట.

హిమాన్షి అచ్చు తనలాగే ఉందని కితాబు కూడా ఇచ్చారట. త్వరలో మరో రెండు సినిమాల్లో నటించనున్నది తను. హిమాన్షి గ్లామర్‌ పాత్రలకు బద్ధ వ్యతిరేకి. “కరోనా నేపథ్యంలో ‘కనిపించని శత్రువు’ పేరుతో కూచిపూడి నృత్యరూపకం చేశాను. సోషల్‌ మీడియాలో ఈ వీడియోలను చాలామంది మెచ్చుకున్నారు. మారిన పరిస్థితుల్లో ఇలా లైవ్‌లో ప్రదర్శన ఇవ్వడం తప్పేం కాదు. ఇప్పటికే నేను ఇన్‌స్టాలో రెండు లైవ్స్‌ ఇచ్చాను” అంటున్నది హిమాన్షి. తను కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌ కూడా. “నాలుగో తేదీన సాయంత్రం 7 తర్వాత లైవ్‌లో నా ప్రదర్శన ఉండబోతున్నది. తప్పక వీక్షించండి” అని కోరుతున్నది హిమాన్షి.