పీడిత వర్గాల అమ్మాయిలు చదువుకుందామని వస్తే కామాంధులు వేధింపులకు గురిచేస్తున్నారని పీఓడబ్ల్యూ సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 అత్యాచారం బాధితురాలికి మద్దతుగా పలు కుల సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోమాజీగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ సంధ్య మాట్లాడారు. పదో తరగతి వరకు మిషనరీ స్కూల్లో చదువుకున్న బాధితురాలికి బయటి ప్రపంచం తెలియదని అన్నారు. కాలేజీ చదువుకని వెళితే దుర్మార్గుల చేతిలో అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌ వేధింపులకు గురైందని తెలిపారు. ఇకపై బాధితురాలి పేరును ‘భూమి’ గా పేర్కొంటున్నట్టు సంధ్య తెలిపారు. భూమి బాధితురాలు కాదని, పోరాడుతున్న చైతన్యం అని వ్యాఖ్యానించారు. తనలా మరొకరికి అన్యాయం జరగొద్దని ఆమె మీడియా ఎదుటకు వచ్చారని తెలిపారు. చదువుపై మమకారంతో ఎన్ని అడ్డంకులెదురైనా భూమి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ చదివారని సంధ్య అభినందించారు.

బాధితురాలిని బంధించి మరీ లైంగిక వేధింపులకు గురి చేసిన డాలర్‌ బాయ్‌ అలియాస్‌ రాజ శ్రీకర్‌రెడ్డిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. డాలర్‌ బాయ్‌ తోపాటు 36 మంది ఆమెపై అత్యాచారం చేసి హింసించారని, వారికి శిక్ష పడేదాక పోరాడుతామని సంధ్య స్పష్టం చేశారు. నేరస్తులందరిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని, భూమికి భద్రత కల్పించాలని సంధ్య పోలీసులను కోరారు. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలని, అలాగే అమాయకుల పేర్లను ఫిర్యాదులో నుంచి తొలగించాలని చెప్పారు.