అండగా నిలవాల్సిన అన్నయ్యే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ నరకం చూపించాడు. అతడి వేధింపులను తట్టుకోలేకపోయిన యువతి చివరికి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగావకాశాలకు కోసం ఎదురుచూస్తున్న సమయంలో అన్నయ్య నుంచి వచ్చిన వేధింపులతో మానసికంగా కుంగిపోయాయని బాధితురాలు పోలీసుల వద్ద వాపోయింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలైన 23 ఏళ్ల యువతి చదువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉంది. అయితే, కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వరసకు అన్నయ్య (25) తరచూ యువతి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. అన్నయ్యే కదా అని యువతి కూడా మాట్లాడేది. ఫ్యామిలీతో కలిసి ఫొటోలు కూడా తీసుకునేవారు. అయితే ఆ నీచుడు మాత్రం యువతిపై కన్నేశాడు. తర్వాత ఫోన్‌ ద్వారా లైంగిక వేధింపులు మొదలయ్యాయి.

తన కోరిక తీర్చకపోతే కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని యువతిని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆ యువకుడిని యువతి తల్లిదండ్రులు మందలించారు. ఈ విషయం అందరికీ తెలియడంతో మరింత కక్ష పెంచుకున్న యువకుడు చివరికి కోరిక తీర్చకపోతే చంపేస్తాననే ధోరణికి దిగాడు. దీంతో తల్లిదండ్రుల సాయంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్‌ వెల్లడించారు.