తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు పనికి పాల్పడ్డ ఓ మహిళ పోలీసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. అలాగే ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు: శివగంగ జిల్లా ఇళయాంకుడికి చెందిన అర్షద్ ఓ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జూలై 5న కొందరు వ్యక్తుల నుంచి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకన్నాడు, డబ్బులను బ్యాగ్‌లో ఉంచాడు. మరి కొందరి నుంచి డబ్బులు సేకరించేందుకు అర్షద్ తన సోదరుడితో కలిసి నాగమలై పుదుకొట్టైకు వెళ్లాడు. అయితే వారు వెయిట్ చేస్తున్న చేటుకు నాగమలై పుదుకొట్టై పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఎస్ వాసంతి చేరుకున్నారు. అర్షద్ వద్ద ఉన్న బ్యాగ్ తీసేసుకుని మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. దీంతో అర్షద్ మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే వాసంతి ఆ బ్యాగ్‌లో డబ్బులు లేవని కేవలం న్యూస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు.

దీంతో అర్షద్ మధురై జిల్లా SP కవి భాస్కరన్‌కు ఈ విషయం గురించి తెలిపారు. దీంతో ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ తర్వాత జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాసంతి, ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వాసంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే వాసంతి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే ఆగస్టు 23వ తేదీని ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ కేసు దర్యాప్తుపై పోలీసుల స్పందన కోరింది. ఆ పిటిషన్‌ను వారం రోజులకు వాయిదా వేసింది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు నీలగిరి జిల్లా కొత్తగిరి లాడ్జ్‌లో ఉన్న వాసంతిని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఆమె సోదరుడిని కూడా శుక్రవారం అరెస్ట్ చేశారు. వారిని మధురై జిల్లా కోర్టులో హాజరపరచడానికి ముందు వైద్య పరీక్షల నిమిత్తం రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, కోర్టు వారికి సెప్టెంబర్ 9 వరకు వారు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.