తెలిసీతెలియని వయసులో ప్రేమ పేరుతో కొందరు చేస్తున్న పనులు వారి కుటుంబానికి తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. అంకుల్‌ను ప్రేమించానని, ఆయనతో వెళ్లిపోతున్నానని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన బాలిక స్నేహితురాలి తండ్రితో వెళ్లిపోయిన ఘటన గుర్తుండే ఉంటుంది. యూపీలోని గోరక్‌పూర్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, ఇక్కడ ఓ మైనర్‌తో వివాహిత వెళ్లిపోవడం గమనార్హం. ఈ వివాహిత చేసిన పనికి ఆమె కుటుంబంతో పాటు కేసును దర్యాప్తు చేసిన పోలీసులూ నివ్వెరపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే: గోరక్‌పూర్‌లోని కంపీర్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. భర్తతో అన్యోన్యంగానే ఉన్న ఈ మహిళకు పాడు బుద్ధి పుట్టింది. 16 ఏళ్ల బాలుడితో ప్రేమాయణం నడిపింది. ఆ బాలుడికి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే వీరిద్దరూ చనువుగా ఉండేవారు. ఇద్దరూ పలుమార్లు కలుస్తున్నప్పటికీ ఏ ఒక్కరికీ అనుమానం రాలేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ.. ఈ క్రమంలో వివాహిత కనిపించకుండా పోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఆ టీనేజర్ కూడా కనిపించకపోవడంతో అతని తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ కనిపించకుండా పోవడంతో పోలీసులకు అనుమానమొచ్చింది. స్థానికులను ఆరా తీశారు ఇద్దరూ చనువుగా ఉండేవారని తేల్చారు. ఆ టీనేజర్‌తో కలిసి వివాహిత వెళ్లిపోయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహితకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వివాహితకు 3,5,7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. భర్తను, ముగ్గురు పిల్లలనూ వదిలేసి ఆ వివాహిత ఇలా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులూ, పోలీసులు నివ్వెరపోయారు. మహాశివరాత్రి రోజున గ్రామంలో వేడుకలు జరుగుతున్నాయని ఆ వేడుకలకు వెళుతున్నామని చెప్పిన ఇద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆ టీనేజర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.