ఆయనో జిల్లా స్థాయి వైద్యాధికారి. కట్ చేస్తే తెల్లకోటు పక్కనపడేసి ఖాకీ చొక్కా తగిలించి ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ గా మారారు. అధికారుల వేధింపుల వల్లే డాక్టర్ గా ఉండాల్సిన తాను ఆటో డ్రైవర్ గా మారానంటున్నాడు రవీంద్రనాథ్. తన ఆవేదనను ఓ స్లోగన్ రూపంలో ఆటోపై రాసి అధికారుల తీరుని ఎండగడుతున్నారు. కర్నాటక బళ్లారి జిల్లా వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ ఎంహెచ్‌ రవీంద్రనాథ్‌ ఆవేదన చెందారు. జడ్పీ సీఈవో స్నేహితుడ్ని ఆర్సీహెచ్ వైద్యుడిగా నియమించాలని తనకు అధికారులు సూచించారని, ఆయన సూచన మన్నించకపోవడంతో తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

అందుకే ఆటో డ్రైవర్‌నయ్యా:

అవినీతి ఆరోపణలు అంటగట్టి సస్పెండ్‌ చేశారని, కొన్నాళ్లకు తాలూకా వైద్యాధికారిగా బదిలీ చేశారని వాపోయారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో లోపాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏ పనైనా చేసి జీవితం సాగించవచ్చని చాటేందుకు 4 రోజుల నుంచీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నానన్నారు. మళ్లీ పోస్టింగ్‌ రాకపోతే చివరి వరకు ఆటో డ్రైవర్‌గానే కొనసాగుతానని డాక్టర్‌ తెలిపారు. తన దుస్థితికి కారకులైన అధికారులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.