పేద ,అనాధ ఆడపిల్లలకు వలవిసిరి వాడుకుని వదిలేసే కామాంధుల వికృతక్రీడకు బలైన ఓ అబల దీన స్థితి ఇది.. ఆమె పేరు ఆలియా(23). హైదరాబాద్‌ పాతబస్తీలోని సలాలమీకి చెందిన అహ్మద్‌, ఆశ దంపతుల కుమార్తె. పేద కుటుంబం, అయిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందితే, బాబాయి పెంచి పెద్ద చేశాడు. 14 ఏళ్ల వయసులో మస్కట్‌ దేశానికి చెందిన ఆమీస్‌తో పెళ్లి జరిపించాడు.

కొన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్న ఆమె భర్తతో కలిసి మస్కట్‌లోని ఉమాన్‌ బీ పట్టణానికి వెళ్లింది. కొద్ది రోజుల తర్వాత భర్త వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల ఓ రోజు హైదరాబాద్‌కు వెళ్తున్నామని చెప్పాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి మస్కట్‌ విమానాశ్రయానికి ఆమెను తీసుకొచ్చాడు. ‘ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా’ అంటూ వెళ్లి మళ్లీ రానే లేదు. భర్త కోసం ఆమె కొన్ని గంటలసేపు ఎదురు చూసింది. అక్కడున్న భద్రతా సిబ్బంది ఆమెను ప్రశ్నించి అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. పాస్‌పోర్టును పరిశీలించారు.

విషయం తెలుసుకొని, ఉచిత పాస్‌పై జెట్‌ విమానంలో ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పంపించారు. ఒంటరిగానే ఇక్కడికి చేరుకున్న ఆమె, చేతిలో చిల్లిగవ్వయినా లేకపోవడంతో తోటి ప్రయాణికుల సాయంతో గురువారం రాత్రి ఎట్టకేలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం వరకు అక్కడే ఉండిపోయింది. ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు ఆమెను ఆదరించి ‘దివ్య దిశ’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఆమె బంధువులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది తేలేదాకా తాత్కాలిక వసతి కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు…