వరంగల్: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ మహా నగరంలో 15 ప్రాంతాలను నో మూవ్‌మెంట్‌ జోన్లు (బయట తిరగడానికి వీలులేనివి)గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లోకి రాకపోకలు నిషేధించిన దృష్ట్యా వారికి ప్రతిరోజూ కూరగాయలు, నిత్యావసర సరకులు అందేలా మార్కెటింగ్‌ శాఖ, బల్దియా, పోలీసు శాఖ ఉద్యోగులు సమన్వయంతో ముందుకు సాగాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి కోరారు.

విధులు నిర్వహించే ప్రత్యేక బృందాలు తగిన రక్షణ కవచాలు వినియోగించాలన్నారు. బల్దియా కార్యాలయంలో 15 ప్రత్యేక బృందాల లీడర్లతో సమావేశం నిర్వహించారు. టీంలీడర్లు తమ తమ మొబైల్‌ నంబర్లను ప్రజలకు ఇవ్వాలని, వాళ్లు ఫోన్లు చేస్తే తప్పకుండా స్పందించాలన్నారు. ఫోన్లు లిఫ్టు చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. నిత్యావసవర సరకులతో పాటు ఔషధాలు, ఇతర అవసరాలు తీర్చాలన్నారు.