నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్లు చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వర్ వెళ్లి ఒక స్వామిజీని దర్శించుకోవడంతో ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్‌ ఇప్పటికే దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే టాక్ ఉంది. కానీ తన భార్యలతో మనస్పర్థలు రావడంతో ఆయన విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేష్ తనకు ఈ వయసులో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే పలు సినిమాల్లో తనతో కలిసి నటించిన పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పవిత్ర లోకేష్‌ విషయానికి వస్తే ఆమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించకపోవడం, కలిసి నటిస్తుండడం, కలిసి కనిపిస్తుండడంతో ఈ టాక్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే.