మతిస్థిమితం లేని మహిళ ఒక చంటి పాపకు జన్మనిచ్చింది. ఆ శిశువును సాకలేని మహిళ ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేస్తే వారిని తోసేస్తుంది. ఆ పిచ్చితల్లి చేతిలో చంటిపాప భవిష్యత్తు ఏమిటోనని స్వధార్‌ నిర్వహకులు భయాందోళన చెందుతున్నారు. ఈనెల 18వ తేదీన ధర్మవరం జాతీయ రహదారిపై మతిస్థిమితంలేని మహిళ ప్రసవవేదనతో బాధపడుతుంటే ట్రాఫిక్‌ నియంత్రణ బోర్డు వద్ద స్థానిక మహిళలు పురుడుపోశారు. తల్లి బిడ్డలను వారు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ‘సఖి వన్‌స్టాప్‌సెంటర్‌’ నిర్వహకుల ద్వారా ఈనెల 24న బొమ్మూరులోని మహిళాప్రాంగణం ఆవరణలో ఉన్న స్వధార్‌ హోమ్‌కు తరలించారు.

అక్కడి నుంచి వారిని చికిత్స ​కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వారిని తిరిగి స్వధార్‌హోమ్‌కు తీసుకువచ్చారు. ఆ శిశువుపై కాళ్లు వేసి పడుకోవడం, తలుపులపై శిశువు చేతిని గట్టిగా కొట్టడం చూస్తుంటే.. హోమ్‌లోని సిబ్బంది కంగారు పడిపోతున్నారు. శిశువును పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తే ఆ పిచ్చితల్లి అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిని శనివారం స్వధార్‌హోమ్‌ సందర్శనకు వచ్చిన రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖామంత్రి తానేటి వనిత దృష్టికి నిర్వాహకులు తీసుకువెళ్లారు.

ఆ తల్లిని అలాగే వదిలేస్తే.. శిశువు ప్రాణాలకు ముప్పు ఉంటుందని మంత్రికి వారు వివరించారు. ఈ తల్లిబిడ్డలను సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తే బాగుంటుందని ఐసీడీఎస్‌ సీడీపీఓలను మంత్రి వనిత ఆదేశించారు.