కొడుకులు లేరని కుంగిపోకుండా తన కూతుళ్లనే కొడుకులుగా భావించాడు. ”ఐఏఎస్‌ కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయానని మీరు నా కోరికను నెరవేర్చాలంటూ” కూతుళ్లకు వివరించాడు. అలాగే వారందరిని కష్టపడి చదివించాడు. ఈరోజు అతని కష్టం ఊరికే పోలేదు ఆ ఐదుగురు సరస్వతి బిడ్డలయ్యారు. ఒక ఇంట్లో నుంచి ఒకరు కలెక్టర్‌గా ఎంపికవడయే గొప్ప అనుకుంటే సహరన్‌ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు తండ్రి సహరన్‌తో పాటు అతని ఐదుగురు బిడ్డలు యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ అరుదైన ఘటన రాజస్తాన్‌లోని హనుమాఘర్‌లో చోటుచేసుకుంది 2018లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు ఇటీవ‌ల‌ ప్రకటించారు.

హనుమఘర్‌కు చెందిన అన్షు, రీతు, సుమన్‌లు రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు (ఆర్‌ఏఎస్‌) ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఏఎస్‌కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ ఆర్‌ఏఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్‌ చేస్తూ ట్విటర్‌లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అన్షు, రీతు, సుమన్‌లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌కు ఎంపికవడం గొప్ప విషయం. ఈ విజయంతో వారి తండ్రికి, కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. అంటూ కామెంట్‌ చేశారు..