బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది ధృవీకరించారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించిన అధికారులు ఈరోజు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రియాకు వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు కొవిడ్ నెగటివ్‌ రావడంతో ఎన్సీబీ అధికారులు రియాను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం డ్రగ్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కేసులో రియా చక్రవర్తికి సెప్టెంబర్‌ 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.