కేరళలోని త్రిశ్శూర్‌లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనాపై భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండగా.. కొందరు వ్యక్తులు వారి ఇంటిని బయటి నుంచి తాళం వేయడం కలకలం సృష్టించింది. వారు ఆదివారం సౌదీ నుంచి కేరళకు తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌లో వారికి నెగెటివ్‌గానే తేలింది.

అయినప్పటికీ వారు తమ ఫ్లాట్‌లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారు నివాసం ఉండే రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వారి ఇంటిని బయటి నుంచి తాళం వేసి.. వారి తలుపునకు కరోనాకు సంబంధించిన స్టిక్కర్‌ అంటించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తూ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.