ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనరేట్‌ వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులు అనుకోకుండా ఒక ఆసక్తికర పరిణామానికి దారితీశాయి. రాష్ట్రంలోని పోలీసుశాఖలో వివిధ అధికారుల హోదాలు, ప్రాంతాలలో మార్పుల ఫలితంగా ఒక పోలీస్‌ అధికారిణి, మరో ఐపిఎస్‌ అధికారి అయిన తన భర్తకు బాస్‌ కానున్నారు.

వృందా శుక్లా 2014 బాచ్‌ నాగాలాండ్‌ క్యాడర్‌కు ఐపీఎస్‌ అధికారిణి కాగా, ఆమె భర్త అంకుర్‌ అగర్వాల్‌ 2016 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. అంటే వృంద తన భర్త అంకుర్‌ కంటే రెండేళ్లు సీనియర్‌. వృందాను లఖ్‌నవూలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి డిప్యుటీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌గా నొయిడాకు బదిలీ చేశారు. ఆమెను 400 మంది ఉద్యోగులు గల ఇక్కడి మహిళా యూనిట్‌కు డీసీపీగా నియమించినట్టు గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ సింగ్‌ వివరించారు..

ఈ నియామకంతో ఇక్కడ సిటీ ఎస్పీగా ఉన్న ఆమె భర్త అంకుర్‌‌, అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఆమె కింద అధికారిగా విధులు నిర్వహించనున్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన ఈ పోలీస్‌ జంట, చిన్నప్పటినుంచి ఇరుగు పొరుగునే నివసించేవారు. అంతేకాకుండా స్థానిక జీసస్‌ అండ్‌ మేరీ స్కూల్లోనే ఇద్దరూ చదువుకున్నారట. వారిమధ్య చిన్నప్పుడే చిగురించిన ప్రేమ పోలీస్‌ అధికారులు అయిన అనంతరం మొగ్గతొడిగి 2019లో వివాహానికి దారితీసింది