అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందే విధంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ది జరిగేలా తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అర్బన్ పాలసీతో పాటు కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీ కూడా రూపొందించాలన్నారు. నూతన అర్బన్ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్స్ చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, HMDAతో పాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల డ్రాఫ్ట్ తయారు చేయాలని అధికారులను కోరిన ముఖ్యమంత్రి, త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని వెల్లడించారు.

అవినీతి జరగడానికి ఏమాత్రం ఆస్కారం కలిగించని విధంగా, అక్రమ కట్టడాలకు ఏమాత్రం వీలులేని విధంగా, పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలు ఉండాలని నిర్దేశించారు. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని సిఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామని చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా, ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలని వివరించారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ పద్దతి ప్రకారం నగర – పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని వివరించారు.