ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షిస్తున్నారా.? అనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న పనులకు కొందరు టీఆర్ఎస్లో ముహాభావంగా ఉన్నప్పటికీ బయటపడడం లేదు. హుజూరాబాద్ లో గెలుపు కోసం ఎంతో శ్రమించిన టీఆర్ఎస్ నాయకులు అక్కడి ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. అదీ గాక ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పాకులాడుతున్న తమకు అనుకున్న న్యాయం చేయకపోయేసరికి తమ దారి వెతుక్కునే పనిలో పడ్డారట. ఇలాంటి వారిని గ్రహిస్తున్న ఈటల రాజేందర్ వారి కోసం రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇలాంటి వారు అప్పుడే తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హూజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ ఓటమి చెందింది.

అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి భర్త్ రఫ్ చేయడంతో ఎమ్మెల్యే, పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత తనను భర్త్ రఫ్ చేసిన కేసీఆర్ పై ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో బీజేపీలో చేరి పోరాడాడు. చివరికి అనుకున్న విధంగానే హూజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఆ తరువాత మరింత ఎత్తు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటనకు వచ్చిన తరువాత ఈటల రాజేందర్ అనుచరులను టీఆర్ఎస్ పార్టీ చేరదీసింది. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చి ఎలాగైనా ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా పోరాడాలని సూచించింది. దీంతో ఒంటరి వాడైన ఈటల బీజేపీ బలంతో ఎలాగోలా గెలుపొందారు. అయితే ఈటలను విడిచిపెట్టిన వారిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఏదోరకంగా కాపాడుకుంటోంది. అయినా చాలా మందిలో నిరాశే నెలకొంది. తెలంగాణ రాష్ట్రం కోసమే కాకుండా పార్టీ కోసం కృషి చేసిన కొందరు తమను ఇప్పటికీ కేసీఆర్ పట్టించుకోవడం లేదనే నిరాశతో ఉన్నారు.

ఇలాంటి వారిని ఈటల రాజేందర్ చేరదీస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆ తరువాత ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులంతా కృషి చేశారు. ఆ తరువాత ఈటల రాజేందర్ పార్టీలోకీలక వ్యక్తిగా వ్యవహరిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అసంతృప్తిగా ఉన్న నేతలను చేరదీసేందుకు ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఓ వైపు రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతూ మరోవైపు ఢిల్లీ వెళ్లి అధిష్టాన నాయకులను కలుస్తున్నారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుగా మారితే వచ్చే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే నేపథ్యంలో కొందరు టీఆర్ఎస్ నుంచి వీడడానికి వెనుకాడుతున్నారట.